గుమ్మడికాయల దొంగ
ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవేరో దొంగ రోజు దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్ట పడే వారు.
గుమ్మడికాయ దొంగ ఊళ్లోనే ఎవరో 'అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దెగ్గరకు వెళ్ళారు.
పెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మోర విని, "ఓస్! ఇంతేనా! గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట వుంటుంది" అన్నాడు.
ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట వుందో లేదో అని పరిశీలించుకున్నాడు.
పెద్దాయన వెంటనే ఇది గమనించి, "దొంగ ఇతనే!" అని అందరికి చెప్పారు. "మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో వుంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము" అని వివరించారు.
" గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నాడట సామెత ఇదే "
----------------------
తెలివైన బాటసారి
అనగనగా ఒక తెలివైన బాటసారి సంతలో మేకని కొనుక్కుని తిరిగి తన ఊరు వెళ్తున్నాడు.
దారిలో ఒక శూన్యమైన ప్రదేశం. జాగ్రత్తగా వెళ్తుంటే హటాత్తుగా ఒక దొంగ చేతిలో కర్ర పట్టుకుని అడ్డు పడ్డాడు.
బాటసారిని కర్రతో బెదిరించాడు. దగ్గిరున్న సొమ్ము, నగలూ దోచుకున్నాడు.
అది సరిపోక మేకను కూడా ఇచ్చేయ మన్నాడు.
బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి, దొంగతో, “బదులుగా నీ కర్ర నాకు ఇస్తావా?” అని అడిగాడు.
దొంగ, “ఎందుకు?” అని ఆశ్చర్యంగా అడిగాడు.
బాటసారి, “నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధ పడుతుంది. కనీసం ఈ కర్ర తీసుకుని వెళ్తే సంత నించి తెచ్చాననుకుని సంతోషిస్తుంది.” అని బదులు చెప్పాడు.
అన్నీ తీసుకున్నాను కదా, కర్రదేముంది అనుకుని, దొంగ బాటసారికి తన కర్రను అందించాడు.
ఇంకేముంది. బాటసారి కర్రతో దొంగని ఠపీ ఠపీ ఇటో నాలుగు అటో నాలుగు దెబ్బలు తగిలించి, తన సొమ్ము, నగలు, మేక అన్నీ తిరిగి తీసుకున్నాడు.
దెబ్బలు తిన్న దొంగ వీలు దొరకగానే పారి పోయాడు.
------------------------------------------






Post a Comment